ఆదివారం 30 ఆగస్టు 2009

మాకూ ఉన్నాయి స్వగతాలు - త్రిపురనేని గోపీచంద్



"మాకూ ఉన్నాయి స్వగతాలు" అని సమాజంలోని అట్టడుగు వర్గాలు , తోటి మానవుల చేత మనుషులు గా చూడబడని పీడిత వర్గాలు చెప్పుకొనే కధలు ఇవి . ఇందులో చెట్లు, పశువులు కూడా తమ గోడును వెళ్ళబుచ్చుకుంటాయి .


                    ఈ కధల రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు.ఇందులో పనిపిల్ల, రిక్షావాడు, గోమాత, చెప్పులు కుట్టేవాడు, చిన్న కారు డ్రైవరు, తుమ్మచెట్లు, అనాధ బాలుడు, మర్రి చెట్టు.. మొత్తం తొమ్మిది కధలు ఉన్నాయి. అన్నీ ఉత్తమ కధలే. ముఖ్యంగా రిక్షావాడు, పనిపిల్ల, అనాధ బాలుడు, చెప్పులు కుట్టేవాడు, చిన్న కారు డ్రైవరు కధలు చాలా బాగుంటాయి.ఇందులో 'రిక్షావాడు ' కధ మా ఎనిమదవ తరగతిలో పాఠ్యాంశంగా ఉండేది. చిన్నప్పుడు చదువుకున్నందువల్లో ఏమో గానీ ఈ కధ నాకు చాలా ఇష్టం. ఈ ఒక్క కధ గురించి మాత్రం వ్రాస్తాను.


                     ఒక రిక్షావాడు రోడ్డుమీద ఎగిరి గంతెయ్యటంతో కధ (అతని స్వగతం) ప్రారంభమౌతుంది. వీళ్ళ ఊళ్ళో వర్షాలు సరిగా పడకుండా ఉండటం వలన, వ్యవసాయం చేయటం వలన పెద్ద ఉపయోగం ఉండదనుకొని పట్నం వెళ్ళి ఏదైనా పని చేసి తన వాళ్ళను పోషించాలనుకుంటాడు. అలా ఒకరోజు పట్నానికి వస్తాడు. ఇతనికి అదంతా ఒక కొత్త ప్రపంచం అన్నట్లు ఉండేది. ఏ పని చేయాలో పాలుఫోక ఉన్న సమయంలో తనని యెరిగున్నాయన రిక్షా లాగమని చెప్తే , ఆ పని చేస్తూ ఉంటాడు. ఒకాయాన మాత్రం రోజూ ఇతని రిక్షానే ఎక్కుతుండటంతో ఆయనికి తన మీద జాలి అనుకోనేవాడు. రిక్షా ఎక్కినందుకు గాను, రిక్షావాడికి ఇచ్చేది రెండు అణాలు. కానీ అందుకు నాలుగణాలు తీసుకుంటారని తెలుసుకుంటాడు.ఆ విషయం తెలిసి రిక్షావాడు అతనిని చూసి నవ్వుకొనేవాడు. ఒకరోజు ఆయన స్నేహితుడిని కూడా రిక్షాలో ఎక్కిస్తాడు. వాళ్ళు మాట్లాడుకొనే మాటలు పరులు ఏమాత్రం వినకూడనివి. వీళ్ళు తనని ఒక 'మనిషి ' గా చూడటం లేదు అనుకుంటాడు. వాళ్ళు "కదలవేరా..." అన్నపుడు ఇతనికి "ఛో ఛో అహ హై" (పశువులను అదిలించేటప్పుడు అనే మాట) అనిపించేది. "వీళ్ళకు నిదానంగా చెబితే అర్ధం కాదు ..." అన్నపుడు 'దీన్ని కోసుకు తినా' అనిపించేది. ఇలా ఆలోచిస్తూ రిక్షాని వదిలేస్తాడు. అది వెళ్ళి, ఒక స్తంభానికి గుద్దుకోని అందులో ఉన్న వాళ్ళకు దెబ్బలు తగులుతాయి. అంతలో రోడ్డు మీద అతనికి తెలిసినాయన "మన ఊర్లో వర్షాలు పడ్డాయంట " అంటాడు. ఆ సంతోషంతోనే ఎగిరి గంతేస్తాడు.


ఇందులో గోపీచంద్ గారి శైలి సరళంగా, సూటిగా ఉంటుంది. చదివింపచేస్తుంది.
గోపీచంద్ గారి కధలు, నవలలు పాఠకులను ఆలోచింపచేసేవి . ఆయనవి 'మమకారం ', 'సంపెంగపువ్వు ' కధలు చదివాను. అవి రెండూ మంచి కధలు. ఇక 'అసమర్ధుని జీవయాత్ర ' తెలుగులో ఉన్న ఉత్తమ నవలలలో ఒకటి.

7 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...

అందీ అందకుండా ఉండే అద్భుత శైలి గోపీ చంద్ గారిదండీ! అసమర్థుడి జీవిత యాత్రలో చూడండి..సీతారామారావు రామయ్య తాత తో "నీ మనవడి ముక్కు తుడిస్తే చూసి చచ్చిపోవాలని ఉంది తాతా"అని వ్యంగ్యంగా అనగానే రామయ్య తాత "చావాలనుకున్న వాళ్ళకి కోరికలు ఉండటం మంచిది కాదు బాబూ"అని వాత పెడతాడు. ఈ నవల గురించి ఎంత రాసినా తక్కువే! వ్యంగ్యం, ఆవేదన, చురుక్కుమనిపించే హాస్యం, గుండె లోతుల్న్ ఇ కొలిచే తాత్వికత అన్నీ ఉంటాయి గోపీచండ్ రచనల్లో!

మీరు చెప్పిన ఆ కథలన్నీ నా దగ్గర "పతితులు"అనే కథా సంకలనంలో ఉన్నాయి. తుమ్మ చెట్టు కథ చదివాక నల్ల తుమ్మ చెట్టు ఎక్కడ కనపడ్డా ప్రతి ఒక్కసారీ గోపీచంద్ కథే గుర్తుకొస్తుంది.

రిక్షా వాడు కథ కూడా ఒక ఆణిముత్యం!

వెంకటరమణ చెప్పారు...

బాగా చెప్పారు సుజాత గారు. అవును అసమర్ధుని జీవయాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతారామారావు తెలుగు నవలా సాహిత్యంలో మొదటి anti hero అని విన్నాను. అప్పటినుంచే 'నవల' అనే ప్రక్రియ కొత్త పుంతలు తొక్కిందంటారు. ఈ నవల గురించి నాకు అర్ధమైనంత వరకు మరొక టపాలో వ్రాయాలి. ఇటువంటి నవలల వలన తమ లోపాలు తాము తెలుసుకొని సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది.

కొత్త పాళీ చెప్పారు...

మరో తెలుగు సాహిత్యాభిమాని. సంతోషం. బ్లాగ్లోకానికి ఆహ్వానం

వెంకటరమణ చెప్పారు...

ధన్యవాదాలు కొత్తపాళీ గారు.

భావన చెప్పారు...

గోపిచంద్ గారి పుస్తకాలు "అసమర్ధుని జీవన యాత్ర" తప్ప ఏది చదవటం కుదరలేదు ఇంత వరకు. మంచి కధ లు పరిచయం చేస్తున్నారు. ఇంకో భాషాభిమాని, సాహిత్యాభిమాని కి బ్లాగ్లోకం లోకి స్వాగతం, మరిన్ని మంచి పోస్ట్ ల కోసం ఎదురు చూస్తుంటాము.

ఉష చెప్పారు...

పైనవారంతా పంచుకున్న సదభిప్రాయమే నాదీను. నాకు కూడా గోపిచంద్ గారి పుస్తకం "అసమర్ధుని జీవన యాత్ర" తప్ప ఏది చదవటం కుదరలేదు ఇంత వరకు. అది కూడా మా అమ్మగారు పదే పదే అనేవారు, అందరివీ "అసమర్ధుని జీవన యాత్ర" లేనని. ఆ కారణంగా చదివాను.

వెంకటరమణ చెప్పారు...

భావన గారు, ఉష గారు నెనర్లు.
గోపీచంద్ గారి సమగ్ర సాహిత్యం పది సంపుటాలుగా సెప్టెంబర్ 8 న విడుదల చేశారండి.
నేను ఆయన ఇతర నవలలు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, గడియపడని తలుపులు,శిధిలాలయం చదివాను. వీటితో పాటు నాన్-ఫిక్షన్ 'పోష్టు చెయ్యని ఉత్తరాలు ' కూడా బాగుంటుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి