బుధవారం 16 సెప్టెంబర్ 2009

ఆరాధన

' ఆరాధన ' - ఈ మాట గుర్తుకు రాగానే నాకు అనేక రకాల భావోద్వేగాలు కలుగుతుంటాయి. అనిర్వచనీయమైన సంతోషం, కోపం, అసహ్యం, భయం ఇలాంటివి. అసలు మనుషులకి ఆరాధన ఎలా కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది? తమలో లేని లక్షణాలను వేరే వాళ్ళలో చూసుకొని ఆనందపడుతున్నారా? తమలాగే పక్కవారు కూడా ఆలోచిస్తున్నారని ఆరాధిస్తున్నారా? అసలు ఆరాధన కి ద్వేషానికి సంబంధం ఉందా? ఆరాధన, అభిమానం వలనే మనుషులు అనిపించుకుంటున్నారా? అవి లేని వాళ్ళు యంత్రాలా? మెటీరియలిస్టులా ? ఏంటో! అన్నీ ప్రశ్నలే. జవాబులు మాత్రం లేవు.

అసలు సినిమా తారలను, క్రీడాకారులను, రాజకీయ నాయకులను విపరీతంగా అభిమానించటం, ఆరాధించటం ఎందుకు? మన ఉపచేతన(సబ్ కాన్షియస్) మనస్థితిలో మనల్ని వాళ్ళలో చూసుకుంటున్నామేమో!!. అయితే ఈ అభిమానం, ఆరాధన ఎంత వరకు ఉండాలనే విషయం ఎప్పుడూ కలవర పరుస్తూ ఉంటుంది. ఒకళ్ళను అభిమానించొచ్చుగా, వారిపై అభిమానంతో వేరే వాళ్ళను ద్వేషించటం ఎందుకు? ( "ఒరేయ్! నువ్వు ఎన్ని సార్లు సినిమా హీరోల గురించి, క్రీడాకారుల గురించి మీ ఊర్లో, కాలేజీలో వాదన పెట్టుకోలేదు? " - లోపలి నుంచి ఎవరో అరుస్తున్నారు.)
ఒకరిపై విపరీతమైన ఆరాధన వలనే వేరే వాళ్ళను అకారణంగా ద్వేషిస్తున్నారేమో. ఎక్కువగా అభిమానించటమంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నట్లే. మనకంటూ సొంత అభిప్రాయాలు, ఆలోచనలు రూపొందేవరకు వేరే వాళ్ళను స్పూర్తిగా తీసుకోవటంలో తప్పులేదు. కానీ అంతటితోనే ఆగిపోతే మన ఆలోచనలంటూ ఎక్కడున్నాయి? పరాయి ఆలోచనలతో మనం బ్రతుకుతున్నామా!!

కొన్ని సార్లు ఈ అభిమానం వారిపై ఒత్తిడిని పెంచుతుంది. ఒక ఊర్లో ఎవరైనా ఒక బాగా చదువుతున్నాడంటే ఊర్లో వాళ్ళు అతన్ని అభిమానిస్తారు. అతనికి మంచి వాడు అనే ముద్ర వేసి అతని చుట్టూ కొన్ని పరిమితులు గీస్తారు. ఈ అబ్బాయి ఇక ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే 'మంచి ' అని సమాజం చెబుతుంది. ఇక అతను కూడా ఆ 'మంచితనానికి ' అలవాటు పడో, సమాజానికి భయపడో వాళ్ళు చెప్పిన చట్రంలోనే ఉండిపోతాడు.
మనం వేరే వాళ్ళని అభిమానించేటప్పుడు అవతలి వారు కూడా మనల్ని అదేవిధంగా ప్రేమించాలని చూస్తుంటాం. వాళ్ళ ప్రమేయం లేకుండా విపరీతమైన అభిమానాన్ని పెంచేసుకొని, వారి నుండి అనుకున్నంత స్పందన లేకపోతే, ఇక ద్వేషం మొదలౌతుంది. - అకారణ ద్వేషం.

ముఖ్యమంత్రి మరణాంతరం జరిగిన ఆత్మహత్యల్ని తలచుకుంటే బాధ, ఆశ్చర్యం, అసహ్యం వంటి భావాలు కలుగుతున్నాయి. ఒక వ్యక్తిపై ఇంతటి ఆరాధన సాధ్యమా!! అతను గొప్పవాడై ఉండవచ్చు. ఎవరైనా కానీ, గుండె ఆగిపోయేంత, ఆత్మహత్య చేసుకొనేంత ఆరాధనా? !!

మరి ఆరాధన ఎక్కడ పరిమళిస్తుంది? ముందు మనల్ని మనం గౌరవించుకొని- కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఇజాన్ని బట్టి కాక వ్యక్తిత్వాన్ని అరాధిస్తూ వారికి బానిస కాకుండా ఉండటమేనా? ఏమో !? . ఇదే సరైనదేమో !!. "అవును ఇదే సరైనది రా" - లోపలి నుండి ఎవరో అరుస్తున్నారు.

7 వ్యాఖ్యలు:

sreenika చెప్పారు...

అవును, ఆరాధన అంటే ఆరాధించే వ్యక్తి భావాలకి బానిసై జీవితాన్ని ఒక పరార్నజీవిలా సాగించడం సబబు కాదని నా అభిప్రాయం. వారి భావాలను ఆదర్శంగా తీసుకుని జీవించాలి. ఆరాధించే వ్యక్తులు లేకున్నా వారి భావాలు సజీవంగా ఉండాలి. ఇది 'సరైనదే' అని నాలోనూ ఎవరో అంటున్నట్లున్నారు.

ఉష చెప్పారు...

ఆరాధన వ్యక్తికి పరిమితంకాక ఆ వ్యక్తిలోని శక్తికి, అభిమానం వ్యక్తి సామర్థ్యం, ప్రభావం వరకు మాత్రం సాగితే మంచిదే. కానీ ఇవన్ని ఎవరి నిర్వచనాలు వారివి. ఎవరి కొలమానాలు వారివి. తిరిగి మనలోని పరిణితి వలనే అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటాం. ఉదాహరణకి మా అమ్మమ్మగారి వూర్లో కన్నిసం రోజు జీతం లేనిదే జీవితం గడవని వారు తమకు నచ్చిన సినిమా నాయకీ నాయకుల కటౌట్లకి పాలతొ అభిషేకించి, పూలమాలలు వేసి పండుగ చేస్తారు సినిమా మొదటిరోజున. ఇక రాజకీయ నాయకుల అభిమానులమని చేసే దురాగతాలు నేను స్వయంగా అనుభవించాను. అలాగే మా తాతగారిని, నాన్న గారినీ వారు చేసిన సహాయం కారణంగా అభిమానించి మైళ్ల తరబడి ప్రయాణించి వచ్చినవారినీ చూసాను. కనుక ఇవి సాధనాలే కానీ సాయుధాలు కానంతవరకు ఫర్వాలేదు.

వెంకటరమణ చెప్పారు...

శ్రీనిక గారు, ఉష గారు : అవునండీ మీరు చెప్పింది కరెక్ట్.

te.thulika చెప్పారు...

బాగుందండీ. మంచి విషయం దృష్టికి తెచ్చేరు. ఆరాధననించే భావదాస్యం, భాషదాస్యం కూడా.

వెంకటరమణ చెప్పారు...

మాలతి గారు, నా బ్లాగు కి స్వాగతం. మీ వ్యాఖ్యకు నెనర్లు.
ఏ దాస్యమైనా దానికి పరిమితి ఉండాలనేదే నా తాపత్రయం.

కొత్త పాళీ చెప్పారు...

Very true.

M vamsi చెప్పారు...

Yes.. its true

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి