హిమజ్వాల, అనుక్షణికం నవలలు చదివాక చండీదాస్ గారికి నేను అభిమానినయ్యాను. ముఖ్యంగా అనుక్షణికం లో ఏ ఇతర నవలలోనూ లేనన్ని పాత్రలు. అద్భుతమైన రచనాశైలి.కేవలం పాత్రలే కనిపించి, రచయిత కనిపించకపోవటం. ఇవన్నీ. ఈ నవలలు కొంత మందికి అసలు నచ్చక పోవచ్చు. కొంత మందికి విపరీతంగా నచ్చవచ్చు. నచ్చినా నచ్చక పోయినా ఈ రచయిత ఏం చెప్పదల్చుకున్నారు అని కుతూహలం కలగటం సహజం. పాఠకుడు తనకు తానే పాత్రల్లోని, నవలలోని అర్ధాన్ని వెదుక్కున్నా గానీ, రచయిత ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసుకోవాలనీ, తను అనుకున్నది ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది. ఆ ఆసక్తితోనే హైదరాబాదు పుస్తక ప్రదర్శనశాలలో ఈ పుస్తకం కనిపించగానే కొనేశాను.
హిమోహసదనం నుంచి ప్రేమతో ...... వడ్డెర చండీదాస్ - చండీదాస్ గారు తన మిత్రుడు అడ్లూరు రఘురామరాజు గారికి రాసిన ఉత్తరాలు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మౌనించిన తమ అభిమాన రచయిత గురించి తెలుసుకొనే ఉత్తరాలు. ఈ ఉత్తరాలలో వ్యక్తిగత విషయాల కంటే అభిప్రాయాలు, అభిరుచుల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. రఘురామరాజు గారు "గీతాదేవి" గురించి తన అభిప్రాయం చెప్పినప్పటి నుంచి వారి పరిచయం మొదలైందంట. మొదట్లో తక్కువగా మాట్లాడుకున్నా రానురానూ చాలా సేపు మాట్లాడుకొనేవారంట. ఎక్కువగా హిమజ్వాల, అనుక్షణికం, "డిజైర్ అండ్ లిబరేషన్" గురించి మరియు ఇతర సాహిత్య సంబంధిత విషయాల గురించి మాట్లాడుకొనే వారంట. ఇదే విషయం ఉత్తరాలు చదువుతున్నపుడు తెలుస్తుంది. చండీదాస్ గారు రాసిన మొదట్లో కేవలం నాలుగైదు లైన్లలోనే జవాబు ఉండేది. అభిరుచుల, వ్యక్తిగత విషయాల ప్రస్తావన ఉండదు. కానీ చివరకి వచ్చేటప్పటికి ఎక్కువగా అభిరుచుల ప్రస్తావనే ఉంటుంది. ఎక్కువగా సంగీతానికి సంబందించిన విషయాలపైనే రాసేవారు. గాయత్రి గారి వీణా ప్రావీణ్యత గురించి ఎక్కువగా చెబుతారు. ఆయన రోజులో ఎక్కువ భాగం సంగీతం, సినిమా పాటలు వింటూనే ఉండేవారంట. తెలుగు భాష చాలా తీయని భాష అనీ, "చిత్ర" గొంతు మిగతా భాషల్లో పాడినా తెలుగులో పాడినపుడు మరింత తీయగా ఉంటుందనీ, సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన దేవదాసు చిత్రం చాలా ఇష్టమనీ, షారూఖ్ ఖాన్ దేవదాసు పై విమర్శ,తెలుగు తర్వాత భారతావని అంటే ఇష్టమనీ, అన్వేషణ సినిమాలో "కీరవాణి ..." పాటలో భానుప్రియ సౌందర్యం అద్బుతం అనీ, పాకిస్తాన్ పై ఇండియా క్రికెట్లో గెలిస్తే తనకానందమనీ, క్రికెట్టే కాదు ఏ విషయంలో పై చేయైనా తనకు చాలా సంతోషమనీ, తిరుపతి లో ఎండాకాలాన్ని భరించటం కష్టమనీ, "మహాప్రస్థానం" కి చలం గారు రాసిన యోగ్యతా పత్రం నోటికొచ్చనీ, అనుక్షణికంలోని ఎకనమిక్స్ పుస్తకాలు తప్పించి అన్నీ చదివినవనీ, "బుచ్చిబాబువి అన్నీ చదవలేదు. చలంవి అన్నీ చదవలేదు. కొడవటిగంటి ని చదవలేదు. రాచకొండ అల్పజీవి ఒక్కటే చదివాను. ఉన్నవ మాలపల్లి చదివాను, గోపీచంద్ అసమర్ధుని జీవయాత్ర చదివాను. విశ్వనాధను చదవలేదు.గ్రాంధికం చదవలేదసలు.నేను తెలుగు రచయితల్లో చదివినవి తక్కువ.ఇంగ్లీషు రచయితలు మరీ తక్కువ. నేను చదివిందీ రాసిందీ తక్కువ " అంటారు.
ఆయన రాసిన రెండువేల పేజీల సాహిత్యం కేవలం Desire and Liberation కి ఫుట్ నోట్స్ మాత్రమేనట. యాభై పేజీల ఈ పుస్తకం చాలా మందికి అర్ధం కాదనీ, కనీసం మూడు వందల పేజీల వివరణ కావాలని రఘు గారు రాస్తున్నారట. "స్వప్నరాగలీన" గురించి రఘు గారు చెప్పినపుడు చండీదాస్ గారు ఒక అరగంట సేపు గంభీరంగా మారిపోయి, కళ్ళవెంట నీళ్ళు పెట్టుకొని, చదివేవాళ్ళ నుంచి ఆశించినది అదే అని చెప్పారట. నిజానికి రఘు గారు "గీతాదేవి" గురించి చెప్పిన అభిప్రాయం చాలా మందికి తట్టేదే. కానీ "స్వప్నరాగలీన" విషయంలో ఆశ్చర్యపోతారు. ఒకసారి రఘుగారు "ఇంకా రాయవచ్చుకదా!" అని అడిగినప్పుడు సంభాషణని మార్చారట. మళ్ళీ అదే విషయాన్ని అడిగినపుడు చండీదాస్ గారిని చూసినపుడు భయమేసిందని రఘు చెబుతారు.
ఈ పుస్తకం చదివేటప్పుడు ఉత్తరాలలోని తేదీలను చూసినపుడు ఆ సంవత్సరం లో నేను ఏం చేస్తూ ఉండుంటానా? అనుకుంటూ జ్ఞాపకాల వైపుకి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆయన చనిపోయేనాటికి కనీసం ఆయన పేరు కూడా వినలేదు. కాలేజీ చదువు అయిపోయాక గానీ ఆ పేరు తెలవలేదు. చండీదాస్ గారి ఉత్తరాలే కాకుండా రఘు గారి ఉత్తరాలు కూడా లభ్యమైతే బాగుండేది కదా అనిపిస్తుంది. అప్పుడు ఆ ఉత్తరాలలో హిమజ్వాల, అనుక్షణికం నవలల గురించి ఏం రాశారా! అని తెలుసుకొనే వీలుండేది కదా అనిపించేది.
పుస్తకం వెల : 60 రూపాయలు
ప్రచురణ సంస్థ : ఎమెస్కో
10 వ్యాఖ్యలు:
chakkani parichayam
అనుక్షణికం ఆంధ్రజ్యోతి వీక్లీలో వస్తున్న టైములో నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నానేమో! "ఎంతకీ తెగదు ఈ నవల!అబ్బబ్బ, ఎన్ని పాత్రలో!"అని ఇంట్లో అనుకుంటూ ఉంటే వినడం గుర్తు.అందులో హీరోయిన్ పేరు "స్వప్న రాగలీన" అప్పట్లో భలే ఫాంటసీ పేరట.
ఇక్కడో పిడకల వేట.తమిళంలో వచ్చిన ఇళయరాజా జీవిత కథను దర్శకుడు వంశీ తెలుగులోకి అనువదించి(ఇదొక సినిమా పత్రికలో సీరియల్ గా వచ్చిందట) దానికి "స్వప్న రాగలీన"అనే పేరు పెట్టారట. ఎక్కడో చదివిన గుర్తు!
ధైర్యం చేసి మొన్ననే "హిమజ్వాల" కొన్నాను బుక్ ఫేర్ లో! గీతాదేవి ఇప్పట్లో అర్థమయ్యేలా కనిపించట్లా!
ఇంతలో మీరేమో ఇదొకటి రాశారు.చదివితే బావుండనిపిస్తోంది.మీ పరిచయంతో పుస్తకం కొంత పరిచయమైంది కాబట్టి ధైర్యం గా కొనేస్తాను మరి!
నేను కూడా హిమజ్వాల, అనుక్షణికం నవలలు చదివాక చండీదాస్ గారికి నేను అభిమానినయ్యాను. ఆయన చివరి దశలో ఆ ఏకాంతాన్ని కోరుకుని, మౌనాన్ని ఎందుకు ఆశించారా అని అనుకునేదాన్ని. నాకు ఈ పుస్తకం కొనటం, చదవటం ఎప్పుడు వీలు పడుతుందో తెలియదు. ఈలోగా మీరో, సుజాత గారో ఒక టపా వ్రాయగలరని ఆశ.
అనుక్షణికం సీరియల్గా వస్తున్నప్పుడే చదివా. చాలా నచ్చింది. నా ఒక నాయకి స్వప్నకి ముద్దుగా రాగలీనా అని పేరెట్టుకున్నా. హిమజ్వాల కూడా చదివా.
బుడుగు గారు ధన్యవాదాలు.
సుజాత గారు గీతాదేవి, స్వప్నరాగలీనలపై రఘు గారి అభిప్రాయం ఏకవాక్యం లోనే చెప్పారు.
"కృష్ణచైతన్య కీ శివరాం మధ్య కొట్టుమిట్టాడుతున్న గీతాదేవి ఆశ"
"స్వప్నరాగలీన sexless. sexually impotent"
అని రాశారు.
వివరంగా పాత్రల గురించి ఏమీ రాయలేదు.
ఉష గారు, చండీదాస్ గారు మౌనాన్ని ఎందుకు ఆశ్రయించారనేది తెలీదు. ఈ పుస్తకంలో కూడా ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. బహుశా "డిజైర్ అండ్ లిబరేషన్" పుస్తకం సమాధానమివ్వగలదేమో!
శరత్ గారు, అనుక్షణికం సీరియల్ గా వచ్చినప్పుడు ఎంతగా మెచ్చుకున్నారో అంతగా ఈ నవలను వ్యతిరేకించారు అని ఎక్కడో చదివాను. అందులో కులాల ప్రస్తావన కూడా ఉండటంతో వివాదాలు చెలరేగాయని విన్నాను.
శ్రీపతి, స్వప్నరాగలీన పాత్రలకంటే గాయత్రి, మోహన్ రెడ్డి పాత్రలే ఉన్నతమైనవని రఘు చెబుతారు.శ్రీపతి, స్వప్నరాగలీన ఆదర్శాలు, అభిరుచులు ఉన్నతమైనవైనా వాస్తవ పరిస్థితులను ఎదుర్కోలేదు అంటారు. నాకైతే అందులో శ్రీపతి, గాయత్రి పాత్రలు బాగా ఇష్టం.
"కృష్ణచైతన్య prolonged passivity కీ శివరాం brief intensity కీ మధ్య కొట్టుమిట్టాడుతున్న గీతాదేవి ఆశ"
అని చదువుకోగలరు
ఈ హిమజ్వాల పుస్తకం ఎప్పుడో చదివాను. నాకో అలవాటుంది. ఏది చదివినా దానిలో విషయం జీర్ణించుకుని, పనికిరానివి నాకుతెలియకుండానే మర్చిపోతాను. అలాగే కథా గమనము, పాత్రల పేర్లు అన్నీ మర్చిపోతాను.మళ్లీ కావలసి వచ్చినప్పుడు కొత్త కథ చదివినట్లుగా చదువుతాను. ఇది ఓ విధంగా వరం అనుకుంటాను. అలాగే ఈ కథకూడా ఏమాత్రం గుర్తులేదు. :)
ఇక మీరు రాసిన విధానం బాగున్నట్టుంది. కానీ రాసినది నాకులాంటి కొత్త వారికి ఏమాత్రం అర్థం కాదు. ఇంకొంత వివరంగా రాయాలనుకుంటా. ( అన్యధాభావించకండి )
ఆయన రాసిన రెండువేల పేజీల సాహిత్యం కేవలం Desire and Liberation కి ఫుట్ నోట్స్ మాత్రమేనట.
ఈ Desire and Liberation అనేది మరో నవలా? పుస్తకమా? ఏమిటది? ఫుట్ నోట్స్ అంటే ఏమిటి? ఈ "స్వప్నరాగలీన" ఎవరు?
ఈ సందేహాలు తీర్చగలరు.
విజయ్ శర్మ గారు, Desire and Liberation అనేది ఆయన రాసిన మరొక పుస్తకం. తాత్విక రచన. ఫుట్నోట్స్ అంటే ఒక పేజీలో కొన్ని గుర్తులున్న చోట రచయిత వివరణ అనుకుంటున్నాను(ఉదాహరణ కు * గుర్తు ఉంటే ఆ పేజీ అడుగున వివరంగా రాస్తారు)
"స్వప్నరాగలీన" అనుక్షణికం నవలలోని ఒక పాత్ర పేరు.
పైన ఉన్న పేర్లన్నీ హిమజ్వాల, అనుక్షణికం నవలల్లోని పాత్రల పేర్లండి.
వెంకట రమణ గారు,
మంచి పుస్తకం గురించి రాశారు. నేను పుస్తకం చదవలేదు కానీ రఘురామరాజు గారి దగ్గర ముఖతహా (విసర్గలు రావటం లేదు. సారీ ) ఈ పుస్తకం లోని విషయాలు ఎన్నో విన్నాను. చండీదాస్ గురించి రఘు గారు చెపితే వినటం , రాస్తే చదవటం రెండూ కూడా మంచి అనుభవాలు. అనుభూతులు.
కల్పనా
కల్పన గారు, ఇప్పుడే మీ వ్యాఖ్య చూశాను. అవునండీ, చండీదాస్ గారి నవలలు చదివిన వాళ్ళకు ఈ పుస్తకం చదవటం మంచి అనుభూతి.
ధన్యవాదాలు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి