బుధవారం 17 ఫిబ్రవరి 2010

చిన్ననాటి తెలుగు పద్యాలు

                 నాకు పద్య సాహిత్యం కంటే వచనం పైనే మక్కువ ఎక్కువ. దీనికి మినహాయింపు వేమన పద్యాలు, ఇంకా చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు. 8,9 తరగతులలో కంఠస్థం చేసిన పద్యాలు మాత్రం కొన్ని గుర్తున్నాయి. ఆ పద్యాలను, ఛందస్సును మర్చిపోకుండా గుర్తుంచుకొనే ప్రయత్నం ఇది.


కొండగుర్తు యమాతారాజభానసలగం.


 8వ తరగతి

 శ్రీకాళహస్తీశ్వరా 


అంతా మిధ్య తలంచి చూసిన నరుండట్లౌటెరింగిన్ సదా
కాంతల్పుత్రులు అర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించు గాని పరమార్ధంబైన నీయందు తాన్
చింతాకంతయు చింత నిల్పడుగదా! శ్రీకాళహస్తీశ్వరా  !


ఏ వేదంబు పఠించె లూత భుజగంబేశాస్త్రముల్సూచె తా
నే విద్యాభ్యసనంబొనర్చె కరి చెంచే మంతమూహించె బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా !


రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులాత్మ వ్యధా
బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తింబొందితిన్ జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా


నిన్నున్నమ్మిన రీతి నమ్మనొరులన్ నీకన్న నాకెన్న లే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు  నా
యన్నా ఎన్నడు నన్ను సంసృతి విషాదాంబోధి దాటించి అ
చ్చిన్నానంద సుఖాబ్ధి తేల్చొదె కదె శ్రీకాళహస్తీశ్వరా !




9వ తరగతి 


 రాజధర్మం
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే  
పారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షులె
వ్వారలుపేక్ష సేతురది వారల చేటగుగాని ధర్మని
స్థారకమయ్యు సత్యశుభదాయకమయ్యును, దైవముండెడిన్



పార్వతీ తపస్సు :

ఎక్కడలేరె వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకూన నీ
వెక్కడ ఘోరవీర తపమెక్కడ యీ పటు సాహసిక్యముల్
తక్కు శిరీషపుష్ప మవధాన పత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా.

భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరా
రాధన కేళి కౌతుక పరాయణయై భరియించె పాండుర
క్షా ధృతి పూర్వకంబుగ ప్రగాఢ పయోధరమండలీ సము
త్సేద విశీర్ణ సంహతుల నేలు మహీరుహ వల్కలంబులన్


ఇందీవరాక్షుని వృత్తాంతం : 
కలడుల్లోక యశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్ 
నలనాభాహ్వయుడేన్ తదీయ తనయుండన్ బ్రహ్మమిత్రుండు శి
ష్యులకుం కంటను వత్తింబెట్టుకొని ఆయుర్వేదమోరంత ప్రొ
ద్దుల జెప్పన్ వినుచుండి మానసమునందుం దజ్జి ఘృక్షారతిన్  

కంటే! బ్రాహ్మణుడెన్ని కారులరచెన్ గర్వించి వీరెల్ల నా
కంటె పాత్రులె విద్యకెట్లు? ఇది నే గైకొందునంచున్ మదిన్ 
గెంటెంపుంజల ముప్పతిల్ల కపటాంతేవాసినై శాంబరిన్ 
గొంటుంజందము మీర శిష్యులగెడం కూర్చిండి చర్చారతిన్



అనినం గన్నులు జేవురింప నధరంబల్లాడ వేల్లత్పునః
పున రుద్యద్భృకుటీ భుజంగ యుగళీ పూత్కార  ఘోరా నిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకంబందంద ఘర్మాంబువుల్
చినుకుం గంతు దిద్రుక్షు రూక్ష నయన క్ష్వేళా కరాళధ్వనిన్



జటిలుండు కిటకిటం పండ్లు గొరకి హుమ్మని కటమ్ములదుర ముకుపుటమ్ములు నటింప
కటకటా! కుటిలాత్మా! యట మటమ్మున  విద్య గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా 
యని కటకటంబడి కకపాలలోని  బూదికేలంగొని యాసురియగు మాయ మాయెడం
ప్రయోగించి వంచించి  యుపహసించితివి గావున నసురవై పిశితంబును నసృఘ్రసంబును 
నశనంబులుగా మెసవి వసుధ వశియింపమని బసుమంబు జల్ల  గుండె జల్లుమని కల్లువడి 
మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి ఇట్లంటి 



భాస్కరా :
చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదనుగ మంచి  కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా

ఉరు గుణవంతుడొండు తనకొండపకారము సేయునప్పుడుం
పరహితమే యొనర్చు నొక పట్టునైనను కీడు సేయగా 
నెరుగడు నిక్కమే కద యదెట్లన కవ్వము బట్టి యెంతయున్ 
తరువగ జొచ్చినం పెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా 

ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన దా
చక్కనొనర్ప కౌరవులసంఖ్యులు బట్టిన ధేనుకోటులం
జిక్కకనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవొడంగ జేసి తుదముట్టడె యొక్క కిరీటి భాస్కరా

బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాతడే
బలము తొలంగెనేని తనపాలిట శత్రువదెట్లు పూరుణుడై
జ్వలనుడు కాన గాల్చుతరి సఖ్యముజూపును వాయుదేవుడా 
బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పడె గాలి భాస్కరా


ధర్మరాజు :
దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియవక్తృత్వంబు కాణాచి వి
ద్యా వైదుష్యము దిక్కు ధర్మమునకుం తార్కాణ మర్యా
దకున్ ఠావౌచిత్యము జీవగర్ర హితశిష్ట వ్రాతసంతోషణ
శ్రీ వజ్రాంగి యజాతశత్రుడు మహీభృన్మాత్రుడే చూడగన్

చాటువులు : 
సిరిగల వానికి జెల్లును
తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్


భరతఖండంబు చక్కని పాడియావు 
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుతున్నారు మూతులు బిగియగట్టి

20 వ్యాఖ్యలు:

Indian Minerva చెప్పారు...

మీకింకా అవి గుర్తున్నాయా bravo!
ఇందులో కొన్నింటిని గుర్తు పట్టగలిగానండీ.
ప్రాయోపవేశం అనే పాఠంలోంచి ఒక పద్యం వుంటుంది సప్త సముద్రములింకిపోయిననూ అంటూ అదొకమంచి పద్యం. కానీ వాటి అర్ధం తెలీకపోయినా బట్టీపట్టాల్సి వచ్చేది అదొక్కటే నాకు నచ్చనిది. చాటువులెటొచ్చీ నాకు పిచ్చపిచ్చగా నచ్చిన పాఠం. భార్యను జ్యేష్ఠా దేవి అంటూ సంబోధింస్తే భార్య "సుతు వాహన వైరి వైరి" అంటూ రిటార్టిస్తుంది చూడండి అది సూపరు. అలాగే "అన్నాతి గూడ హరుడవే.... కన్నొక్కటి కలదు గాని కౌరవపతివే"...

ravichandrae చెప్పారు...

ఒక్క చాటువులు మాత్రం చదివినట్లు గుర్తుంది. మిగతావి గుర్తులేవు. ఇంతకీ మీరు పదో తరగతి ఏ సంవత్సరంలో చదివారు?

మైత్రేయి చెప్పారు...

తప్పులుంటే సవరించండి.. గుర్తుంటే పూర్తి చేయండి :)

నటవిట గాయకా గణిక కుటిల
వచశ్శిదు రసము గ్రోలెడు చేవికిన్
గటు వీశాస్త్రము వలదిచ్చట నిన్ను
చదివిమ్పకున్న జరగదే మాకున్

తండ్రీ నాకు విద్య ననుగ్రహింపవు గదే అని ప్రార్ధిమ్పగన్
తీన్డ్రము లాడి ......
----
గుండ్రా దాచిన పెళ్లి ఆగునా జిక్కుం గస్ట ముస్టింపచా

మైత్రేయి చెప్పారు...

BTW., I studied the same syllabus which u mentioned here..

మైత్రేయి చెప్పారు...

సారపు ధర్మమున్.. ..
నాకు భలే ఇష్టమైన పద్యం.

అలాగే ఆ పాఠం లోనే ..
వారును వీరు పండితులు విక్రములు ..
ఈ పద్యం కూడా బాగుంటుంది .. గుర్తులేదు బాగా..

రమణ చెప్పారు...

@ Indian Minerva : ప్రాయోపావేశం లో పూర్తిగా గుర్తులేవండీ. "అక్కట యమ్మహారణమునందు వియచ్చర కోటి ...." , మీరు చెప్పిన పద్యం, మిగతా చాటువులు లీలగా గుర్తున్నాయి కానీ పూర్తిగా కాదు. అసలు తొమ్మిదో తరగతి పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం. అందులో ఉన్న పద్య భాగం కానీ గద్యభాగం లోని పాఠాలు కానీ ఉత్తమమైనవి, చాటువులతో కలిపి. ఆ పుస్తకం కోసం వెదుకుతున్నాను కానీ ఎలా దొరుకుతుందో తెలియదు. ఖాళీగా ఉన్నపుడు ఈ పద్యాలను మనసులో చదువుకుంటూ ఉంటాను. అందుకే గుర్తున్నాయి.

@ravichandrae :
చాటువులు పాఠం చాలా బాగుంటుంది. నేను పదోతరగతి 1997 లో చదివాను.

రమణ చెప్పారు...

@మైత్రేయి : గుర్తులేవండి

సుజాత చెప్పారు...

విద్యా సంవత్సరాలు మాచ్ కాకపోవడం వల్ల, నేను మీ కంటే సీనియర్ని కావడం వల్ల ఇక్కడ కొన్ని పద్యాలు మాత్రమే పాఠ్యాంశాలుగా తెలుసు నాకు....!విడిగా తర్వాత చదివాననుకోండి.

ఇందులో చాటువులు, చదువది ఎంత గల్గిన,ఇవి పాఠాలుగా చదివిన గుర్తున్నాయి. కొండగుర్తుతో కట్టలకొద్దీ పద్యాలు గణవిభన చేసేయడం మాత్రం గుర్తుంది.

మొదటి గణం తెలియగానే ఇక పద్యం అంతా వచ్చేసినట్లేగా!
న- ఓ..ఇది నజభ జ జజరా.
స-...ఇది సభరనమయవ
మ...ఇది మసజసతతగ..ఇలా కనిపెట్టేయడమే!

గణ విభజన చేయడం భలే ఉంటుంది నిజంగా!

మళ్ళీ హైస్కూల్లోకీ పోవాలనిపించేలా ఉంది!

@Indian minerva,
మీరు చెప్పిన ఇతర చాటువులు పెద్ద బాల శిక్షలో దొరుకుతాయి చూడండి..ఇవిగో ఆ రెండు పద్యాలు!

“పర్వతశ్రేష్ట పుత్రిక పతి విరోధి
యన్న పెండ్లాము అత్తను గన్నతల్లి
పేర్మిమీరిన ముద్దుల పెద్దబిడ్డ!
సున్న మించుక తేగదే సుందరాంగి!”....ఇదీ బావగారి మోటు సరసం! దానికి మరదలిచ్చిన ఘాటు జవాబు ఇదీ!


శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరివైరి! సున్నంబిదిగో”..

వీటిని విడగొట్టి అర్థం చెప్పండి..సరదాగా!

naagola చెప్పారు...

"అత్తను గన్న తండ్రి" అనుకుంటానండి సుజాత గారు

రాజన్

భైరవభట్ల కామేశ్వర రావు చెప్పారు...

రమణగారు,

నేనుకూడా ఇవే పాఠాలు చదువుకున్నాను! నాకు గుర్తున్న మరికొన్ని పద్యాలు నా బ్లాగులో ప్రచురించాను. http://telugupadyam.blogspot.com/2010/02/blog-post_17.html

కాని మీరు పదోతరగతి 1997లో చదివానన్నారు. 1990కి 1997 అని పొరపాటున అన్నారా? ఎందుకంటే నేను పదోతరగతి చదివింది 1990లో!

Sandeep చెప్పారు...

చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మీరు చదువుకున్న పద్యాలు గుర్తున్నాయి అంటే, నాకు ఒక పద్యం గుర్తుంది, మా అన్నయ్య చదివేవాడు అప్పట్లో, "అక్కటియమ్మాహరణమ్మున" అని. అలాగే నాకు "పుత్తడిబొమ్మ పూర్ణమ్మ" లో "పట్టమేలే రాజు పోయెను మట్టికొట్టెను కోటపేటలు, పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్" అనే పద్యం గుర్తుంది. ఇంక మా batch కి వాచకం మారడంతో, "అటచని కాంచె భూమిసురుడు", "తలమే బ్రహ్మకునైననీ" వంటివే గుర్తున్నాయి.

shyamkr చెప్పారు...

అవని విదీర్ణ మైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహార్న్వమది ఇంకినన్
దివస నాథుడు చంద్రుడు తెజోమొందినన్
కువలయ నాథ నీకు నొక కుత్సిత భావము కల్గ నేర్చునే
భవ దుప యోగ్యమైన ఈ నృప భారము నాకు వహింప శక్యమే .....

I think you are referring to the above పద్యం from ప్రాయోప వేశం పాఠం...

shyamkr చెప్పారు...

నాకు ఇది కూడా గుర్తు ఉందోచ్ .... పానుగంటి లక్ష్మి నరసింహ రావు గారు రాసి -----జంఘాల శాస్త్రి పాత్ర చే పలికించిన ........ (పాఠం పేరు గుర్తు లేదు)

మన భాషయే .... మకరంద బిందు బృంద స్యంగన సుందర మగు మాతృ భాషయే ......
మహానంద కందల సందోహ సంధాన తుందిల మగు మాతృ భాషయే ....
కమ్రత కు కమ్రత .... కథినత కు కథినత.... (ఒత్తు ట .....నా స్క్రిప్ట్ లో ఆ లెటర్ కనబడుట లేదు )
బిగి కి బిగి ..... జోరునకు జోరు ..... ఎదురెక్కునకు ఎదురెక్కు ....
మంధత కు మంధత ....ధాటి కి ధాటి .....
అన్ని వన్నెలు అన్ని చిన్నెలు అన్ని వగలు అన్ని వద్దికలు అన్ని తళుకులు అన్ని బెళుకులు అన్ని హొయలు అన్ని ఒయ్యారములు....
కల మాతృ భాషయే ......

రమణ చెప్పారు...

కామేశ్వరరావు గారు నేను పదోతరగతి చదివింది 1997 లోనే. మీ టపా తో మరికొన్ని పద్యాలు గుర్తుకు వచ్చాయి. ధన్యవాదాలు.

శ్యామ్ గారు అవును ప్రాయోపావేశం లోనిదే. పానుగంటి వారు రాసిన ఆ పాఠం పేరు 'స్వభాష' అండీ. ధన్యవాదాలు.

Indian Minerva చెప్పారు...

@shyamkr గారూ: మీరిచ్చిన పద్యమే నేనన్నది. పానుగంటి లక్ష్మి నరసింహ రావు గారి పాఠం పేరు స్వభాష కదా... ఏదో ఒక చిన్నపిల్లల కార్యక్రమంలో ఒక వకీలుని ఉపన్యసించమంటే ఆయన ఇంగ్లీషులో మాట్లాడాడని ఆయనను విమర్శిస్తూ చేసిన ప్రసంగం కదా అది. ఆ సరళ గ్రాంధిక శైలి చాలా బాగుంటుంది ఒక విధమైన లయతో కూడుకొని.
ఒక చిన్న సవరింత అది "మహార్ణవమది ఇంకినన్" కదా... "తెజోమొందినన్" దీని మీదకూడా నాకేదో సందేహం.

@సుజాత గారూ: విడగొట్టి అర్ధాలు చెప్పడానికి నాకంతగా పురాణ పురుషుల మధ్య సంబంధాలు తెలీవండీ. ప్రయత్నిస్తాను.

పర్వతశ్రేష్ట పుత్రిక పతి విరోధి హిమవంతుని కూతురు పార్వతి ఆమె పతి విరోధి దక్షుడు
యన్న పెండ్లాము అత్తను గన్నతల్లి --తెలీదు
పేర్మిమీరిన ముద్దుల పెద్దబిడ్డ! జ్యేష్టాదేవి (దరిద్రదేవత)
సున్న మించుక తేగదే సుందరాంగి!

మొత్తానికి ఈయన అన్నదల్లా "సున్నం తీసుకరావే దరిద్ర(పు మొహ)మా .


శతపత్రంబుల మిత్రుని --బ్రహ్మదేవుని మిత్రుని (విష్ణువు)
సుతు జంపిన వాని బావ సూనుని మామన్ --ఆయన సుతుడు మన్మధుడు ఆయన్ని చంపింది శివుడు ఆయన
--బావెవరో మళ్ళీ ఈ సూనుడెవరో నాకు తెలీదు కానీ అయన మామ
మాత్రం చందుడు :)
సతతము దాల్చెడు నాతని --చంద్రుని నిత్యం ధరించేవాని (శివుని)
సుతువాహన వైరివైరి! సున్నంబిదిగో --వాహనానికి శత్రువు (పిలి) కి శత్రువు (కుక్క)

ఈవిడన్నదల్లా "కుక్కా సున్నం తెచ్చానిదిగో".

భైరవభట్ల కామేశ్వర రావు చెప్పారు...

మీరన్నదాన్ని బట్టి ఎనిమిది, తొమ్మిది తరగతుల వాచకాలను సరిగ్గా అవే పాఠాలతో ఏడేళ్ళకి మళ్ళీ రిపీట్ చేసారన్నమాట, ఆశ్చర్యంగా ఉంది!

చాటువులకి అర్థాలు:

పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి - పార్వతి భర్త శివుడు శత్రువు మన్మథుడు
అన్న - మన్మథుని అన్న బ్రహ్మదేవుడు (అతనుకూడా విష్ణుమూర్తి కొడుకే కాబట్టి)
పెండ్లాము - బ్రహ్మ భార్య సరస్వతి
అత్తను గన్న తండ్రి - సరస్వతి అత్త లక్ష్మి. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు.
పేర్మిమీరిన ముద్దుల పెద్దబిడ్డ - జ్యేష్ఠా దేవి (దరిద్ర దేవత)

శతపత్రంబుల మిత్రుడు - తామరపూవుల మిత్రుడు సూర్యుడు
సుతు జంపిన వాడు - సూర్యుని కొడుకు కర్ణుడిని చంపినవాడు అర్జునుడు.
బావ - అర్జునుని బావ కృష్ణుడు
సూనుడు - కృష్ణుని (విష్ణుమూర్తి) కొడుకు మన్మథుడు
మామ - మన్మథుని మామ చంద్రుడు. మన్మథుని తల్లి లక్ష్మీదేవికి పాలసముద్రంలో తోడపుట్టినవాడు చంద్రుడు కాబట్టి
సతతము దాల్చెడు నాతని - చంద్రుణ్ణి ఎప్పుడు ధరించే వాడు శివుడు
సుతు వాహన - శివుని కొడుకు వినాయకుని వాహనం ఎలుక
వైరి వైరి - ఎలుక శత్రువు పిల్లి, దాని శత్రువు కుక్క

రమణ చెప్పారు...

కామేశ్వరరావు గారు, మీరు చదివిన సిలబస్ 1998 వరకు మారలేదు. అంతకుముందు ఎప్పటినుంచి ఈ సిలబస్ ఉందో తెలియదు.

Sanath Sripathi చెప్పారు...

ఇవ్వాళే చూశా మీ టపా, భలే... నేను కూడా 1989-1990 లోనే చదువుకున్నా పదవ తరగతి . అవే పద్యాలు. మీ బ్లాగు లో పద్యాలు ఒకటి మొదలెట్టగానే అన్నీ అదే వరస లో వచ్చేశాయి.. మా ఆవిడ హాస్చర్య పోయింది నేను మురిసిపోతూ పద్యాలు పాడేసుకుంటున్నా అని..

మనస్ఫూర్తి గా ధన్యవాదాలు. మళ్ళీ మా బడిరోజులు గుర్తుచేసినందుకు.

చిన్న ముద్రా రాక్షసం అనుకుంట.
తక్కు శిరీషపుష్ప మవధాన పటుత్వమునన్ అని ఉండాలేమో కదా....

సనత్ కుమార్

Sanath Sripathi చెప్పారు...

క్షమించాలి
తక్కు శిరీషపుష్ప మవధాన పరత్వమునన్ అనుకుంట ....

సనత్ కుమార్

మందాకిని చెప్పారు...

ఏ క్లాసు లోనో గుర్తులేదు, ఎనిమిదో తరగతి అనుకుంటా. కడిమి చెట్టు అనే పాఠం ఉండేది. ఈ చెట్టు పేరు కొత్త కావటం వల్లనో, అందులోని భాష వల్లనో ఆ పాఠం నాకు చాలా ఇష్టం. దాని గురించి ఎవరైనా చెప్పగలరా? నాకిప్పుడది స్పష్టంగా గుర్తు రావటం లేదు.
ఇక విశ్వనాథ నాయకుడు అనే ఉపవాచకం ఉండేది. నేనే చదివాను. ఎందుకో మా బళ్ళో ఉపవాచకాన్ని పట్టించుకొనేవారు కాదు.ఇంకా పుత్తడి బొమ్మ పూర్ణమ్మా మనసులో ముద్రించుకు పోయింది. అందులో
నలుగురు కూర్చుని నవ్వేవేళల నా పేరొకపరి తలవండి! అనే మాటకు కళ్ళల్లో నీళ్ళొస్తాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి